జంధ్యాల పాపయ్య శాస్త్రి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు.
పుష్పవిలాపము మరియు కుంతీకుమారి వంటి కవితలు ఘంటసాల గారి రికార్డుల ద్వారా బాగా ప్రాచుర్యము పొందాయి.
పుష్పవిలాపము లోని కొన్ని పద్యములు:
సీ||నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
"కుంతీకుమారి" నుండి
మ||ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ
చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప
ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్
బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి.
భోగ భాగ్యాలతో తులదూగుచున్న
కుంతి భోజుని గారాబు కూతురు నయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన."
"అంజలి" నుండి
సీ||పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెల పాలు పోసి పోసి
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాదిదేవ
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు
సీ||లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
సీ||కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
====
కరుణశ్రీ కవిత్వం