గ్రామ దేవత
వికీపీడియా నుండి
ఇదే పేరుతో 1968లో వచ్చిన సినిమా గురించి గ్రామదేవతలు (సినిమా) చూడండి.
గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత
విషయ సూచిక |
[మార్చు] గ్రామదేవతా వ్యవస్థ
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యము గా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలము లో మానవుడు ఎంతోతెలివైనవాడు,ఇంట్లోవున్న చిన్నా,పెద్దా,ఆడా,మగా-అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో ,కంచి కామాక్షమ్మ దగ్గరికో,బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళేవీలుండకపోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్సనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండావుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించుకొన్నామనే త్రుప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటుచేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద,స్మార్త,ఆగమ శాస్త్ర పండితులచేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తిప్రపత్తులతోపాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి భాద్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి,ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిస్ట జరిగిన ఆ నెల,ఆ తిథి నాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
[మార్చు] దేవతల ఆవిర్భావము
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈపంచభూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.
- పృధ్వీ దేవత
పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము,కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన ప్రుధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర,గోగునార...ఇవే వారి జీవనఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మ ని యేర్పాటు చేసారు.జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండేప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము,అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూవుండడము, దాన్నేసొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము ... ఇలా సాగుటతూవుండేదీ వ్యవస్థ. పంటవేసేటప్పుడుకూడా ఈతల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారుకాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందినాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
- జల దేవత
జలానికి సంభందించిన తల్లి గంగమ్మ--గంగానమ్మ. ఈ తల్లి భూమి మీదకాక భూమిలోపల ఎంతో లోతుగావుంటుంది. గుడిఎత్తుగాకట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
- అగ్ని దేవత
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మ నూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావస్యనాడు,పున్నమ్మ ను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవ్రుత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్నుసూర్యుడుగానూ ఎడమకన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).
- వాయు దేవత
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్దగాలి. కొండప్రాంతములోవుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ వుపద్రవము వుండకుండా రక్షించేందుకు కరువలమ్మ ను యేర్పాటు చేసుకున్నారు.
- ఆకాశ దేవత
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు,మెరుపులు,గాలివాన..ఇలాంటివాటినుండి రక్శించేందుకు ఈ తల్లి ని యేర్పాటు చేసుకున్నారు.
[మార్చు] పోషణ,రక్షణ నిచ్చే దేవతలు
ఇక ప్రజల మనసులో పుట్టి ఏకోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే భాద్యతని స్వీకరంచి భక్తులకు అండగానిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలగే ఆతల్లిని ప్రార్దించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు,చేట వుంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని,భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము...అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈపనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తి కి జీవనభ్రుతి కలిగించి పోసించే తల్లి ' పోచ+అమ్మ=పోచమ్మ'అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాదులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రమణ్యషష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈతల్లికే 'నాగేస్వరమ్మ'అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లి కి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రమణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవము గా వుంది.
[మార్చు] గ్రామదేవతా నామ విశేషాలు
సాదారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దము లో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమము గా అది 'మావుళ్ళమ్మ' అయింది. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద(గళము) మచ్చ(అంకం) కారణముగా అంకగళమ్మ అంకాళమ్మ మారిపోయింది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట(అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల(ఆ అవధినించి రక్షించగల)అమ్మే'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది. గ్రామప్రజల మంచిని చూసే(కనే)అమ్మ కన్నమ్మ గా ఎప్పుడూ సత్యాన్ని(నిదర్సనాలని)చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. స్వచ్చమైన అమ్మ అనే అర్దములో అచ్చ(స్వచ్చమని)సు+అచ్చ=స్వచ్చ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మ గా అయ్యింది. అలాగే పుల్ల(వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్దగాపరిశీలించి సూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈతల్లి కి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి(బాల)+అమ్మ= పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల(భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ(భార్య)కాబట్టి ఈమెను 'అయ్యమ్మ'అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ'అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా లోని సోంపేట.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- http://www.webindia123.com/andhra/festivals/festivals.htm
- స్వాతి వార పత్రిక - విజయవాడ
- వార్త దినపత్రిక ఆధ్యాత్మిక పేజి
- డా.వందన శేషగిరిరావు - శ్రీకాకుళం
- Grama Devatalu - Vyasa Samputi (1993-94) Author: Bramaramba.K