గుంటుపల్లి (కామవరపుకోట)
వికీపీడియా నుండి
గుంటుపల్లె లేదా గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. పురాతనమైన బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామము చారిత్రకంగా ప్రసిద్ది చెందినది. జీలకర్రగూడెం గుంటుపల్లి గ్రామాలు ఒకే పంచాయితీ పరిదిలో ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] గ్రామం స్వరూపం
- వ్యవసాయం
ఎర్రమట్టి కలిగిన కొండల అంచున ఉన్న ఈ గ్రామాలలో వ్యవసాయం ప్రధానంగా మెరక తోటల పెంపకం - టేకు, కొబ్బరి, పామాయిల్, మామిడి, సపోటా, జీడిమామిడి అధికంగా జరుగుతున్నది. చెరువు క్రింద వరి వ్యవసాయం సాగుతుంది.
- జనాభా
గుంటుపల్లి, జీలకర్ర గూడెం, ఇతర శివారు గ్రామాలతో కలిపి జనాభా వివరాలు (2001 జనగణన ప్రకారం) ఇలా ఉన్నాయి.[1]
- మొత్తం ఇళ్ళు: 1146
- మొత్తం జనాభా: 4136 ( పురుషులు: 2136, స్త్రీలు: 2000)
- 6 సంవత్సరాలలోపు పిల్లలు: 506 (మగ 249, ఆడ 257)
- షెడ్యూల్ కులాల వారు: 1256 (మగ 677, ఆడ 579)
- షెడ్యూల్డ్ తెగలవారు: 19 (మగ 9, ఆడ 10)
- విద్య
గ్రామ విద్యార్ధుల కొరకు జీలకర్ర గూడెంలో ఒక హైస్కూల్ ఉన్నది.
- వైద్యం
- రవాణా
జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి గుంటుపల్లికి బస్సు సౌకర్యం ఉంది. షుమారు 30 కిలోమీటర్ల దూరం. కాని బస్సుపైన జీలకర్ర గూడెం అనే బోర్డు ఉంటుంది. ఏలూరు నుండి జీలకర్రగూడెం వెళ్ళే బస్సులు గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్రగూడెం వెళతాయి. మరోమార్గంలో ఏలూరు నుండి గోపన్నపాలెం, ముండూరు, తడికలపూడిల మీదుగా కామవరపుకోట వెళ్ళవచ్చును. అక్కడినుండి జీలకర్రగూడేనికి షుమారు 5 కిలోమీటర్లు దూరం. ఏలూరు పాత బస్సు స్టాండులోనూ, సోమవరప్పాడు దగ్గరా "గుంటుపల్లి బౌద్ధారామాలను దర్శించండి" అనే చిన్న బోర్డులు పెట్టారు.
స్కూలు, కాలేజీ విద్యార్ధులు ఇక్కడికి పిక్నిక్‌లకోసం రావడం జరుగుతుంది. గ్రామంలో ప్రత్యేకించి యాత్రికులకు వసతి సౌకర్యాలు లేవు. రోడ్డు ప్రక్కన ఉండే చిన్న చిన్న హోటళ్ళలో టిఫిను, భోజనం లభిస్తాయి. కొండపైకి వెళ్ళే దారి మొదట్లో పురావస్తుశాఖవారి ఆఫీసులో ఒక ఉద్యోగి టిక్కెట్లు ఇస్తాడు. ఒకో టిక్కెట్టు 5సరి చూడాలి రూపాయలు. కొండపైని నీళ్ళు లభించవు గనుక అక్కడ చిన్న కుండలో మంచినీరు ఉంచారు.
[మార్చు] చారిత్రిక ప్రాధాన్యత
- ప్రధాన వ్యాసం: ఆంధ్రదేశంలో బౌద్ధక్షేత్రాలు
ఆంధ్ర దేశంలో బుద్ధుని కాలంనుండీ బౌద్ధమతం జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా షుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.[2]
గుంటుపల్లి వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి.ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. [3] కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్ధం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.
కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 మధ్యకాలంలో విస్తరిల్లినవని భావిస్తున్నారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం - వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు. (బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించారు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమితమవ్వాలి కాని రసానుభూతి కాదు - మౌలిక బౌద్ధంలో క్రమశిక్షన అంత కఠినంగా ఉండేది.[2]) జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధారామాలు కనుగొన్నారు.
[మార్చు] బౌద్దారామ వివరాలు
- గుహాలయం
క్రీ.పూ. 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపము (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాలకు వలే) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహారులోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలున్నాయి.
- పెద్ద బౌద్ధ విహారము / ఆరామము
ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయము. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానము. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహలలోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.
- మొక్కుబడి స్తూపములు
కొండపైని వివిధ ఆకృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు అరవై మొక్కుబడి స్తూపాలున్నాయి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కుబడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.
- రాతి స్తూపములు
క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ.పూ.19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీ.
- శిధిల మంటపం
ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ.పూ. 1 నుండి క్రీ.శ.5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.
- చైత్య గృహము
ఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంకృత అధిష్టానము నాసిక్, కార్లే గుహలను పోలి ఉంది.
- ఇటుకల స్తూప చైత్యము
ఇది కూడా క్రీ.పూ.3-2వ శతాబ్దానికు చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ.పూ.2-1వ శతాబ్దమునకు చెందిన ఒక ఉపాసిక కట్టించెనని తెలియవస్తున్నది. ఈ చైత్య గృహము 11మీ. వ్యాసం కలిగి ఉన్నది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉన్నది.
- ఇటీవల లభ్యమైనవి
ఇటీవల 04-12-2007న ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభమునకు చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమయినది. ఈశాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూసాయి.నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడి కారాలు,గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినది. ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసినట్లు ఈ శిలా ఫలకంలో ప్రాకృత బాష లో ఉన్నది. కేంద్ర పురావస్తుశాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలికి తీసింది.
[మార్చు] ఇవి కూడా చూడండి
- బౌద్ధ మతము
- కంఠమనేనివారిగూడెం
- వేంగి
- ఆంధ్రదేశంలో బౌద్ధక్షేత్రాలు
- అయోమయ నివృత్తి పేజీ గుంటుపల్లి - ఇదే పేరు గల మరికొన్ని గ్రామాల కోసం
[మార్చు] మూలాలు, బయటి లింకులు
- ↑ పశ్చిమ గోదావరి జిల్లా జనాభా వివరాలు
- ↑ 2.0 2.1 డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన బౌద్ధము-ఆంధ్రము
- ↑ http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp The complete list from West Godavari District is
- 132. Mounds containing Buddhist remains - Arugolanu
- 133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
- 134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
- 135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
- 136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
- 137. Ancient Mounds - Pedavegi
- http://www.bestindiatours.com/buddhist/guntupalli.html
- http://www.occultcorpus.com/forum/archive/index.php?t-2739.html
- http://www.aptourism.in/buddhisminap.html
- ఈనాడు డెయిలీ న్యూస్ 05-12-2007
|
|
|
|---|---|
| అంకాలంపాడు · జలపవారి గూడెం · తూర్పు యడవల్లి · గుంటుపల్లె · జీలకర్రగూడెం · కంఠమనేనివారిగూడెం · కళ్ళచెరువు · కామవరపుకోట · ఖండ్రిక సీతారామవరం · గద్దేవారిగూడెం · కొండగూడెం · మంకెనపల్లె · మైసనగూడెం · పొలాసిగూడెం · రాజునాగులపల్లె · రామన్నపాలెం · రావికంపాడు · శయనరావుపాలెం · తడికలపూడి · ఉప్పలపాడు · వడ్లపట్లనూతనం · వీరంపాలెం |