Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

గిడుగు రామమూర్తి

వికీపీడియా నుండి

గిడుగు వేంకట రామమూర్తి

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియ జెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. హేతువాది . శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు 'గిడుగు '. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.

విషయ సూచిక

[మార్చు] తొలి జీవితం

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. 1877 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్ర చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయాడు.

విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష ప్యాసయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారం లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటిరెండుభాగాలు (చరిత్ర తప్ప) ప్యాసయ్యాడు. 1896లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నాడు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో ఫస్టుక్లాసులో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి హైస్కూలు కాలేజి అయింది. అప్పుడు అతనికి కాలేజి తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.

[మార్చు] సవర భాష పాండిత్యం

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళుపెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో "రావ్‌ బహదూర్‌" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది.

"సవర" దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని "శబరు"లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు.

[మార్చు] శాసనాల అధ్యయనం

హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగదేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.

[మార్చు] వ్యక్తిత్వం

రామమూర్తికి చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. సవరలు, హరిజనులు అంటరాని జనాలని అప్పటి సంఘం అంటుండే ఆ కాలంలోనే, అతను సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి,భోజనం పెట్టేవాడు.హేతువాది .


1930లలో ఒరిస్సా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒరిస్సా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒరిస్సాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936లో ఒరిస్సా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం.

[మార్చు] వచనభాష సంస్కరణోద్యమం

1907లో J. A. Yates అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పేపద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది అతని ముఖ్యసమస్య. అంతకుముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో Mrs A.V.N. College ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి యేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యాన్ని గురించి ఉపన్యాసాలిచ్చాడు.

1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. వీరేశలింగం పంతులు ఊతం కూడా ఇతనికి లభించింది. 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు ' అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో(1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు "గిడుగు". సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.

1912-13లో స్కూలుఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలు ఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక జీ.ఓ. ఇచ్చాడు. ఆధునికభాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రను ఉదాహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.


స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో Miscellany of Essays (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. (?)1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారి కభాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే "ప్రతిభ" అనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా "జనవాణి" అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.


గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -

దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి.గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థంచేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?
స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామికపరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మనప్రజలకు, సామాన్యజనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.


గిడుగు రామమూర్తి , జనవరి 22, 1940 న కన్ను మూశాడు.


తండ్రికి తగ్గ తనయుడిగా గిడుగు సీతాపతి కీర్తి గడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ' కళాప్రపూర్ణ ' బిరుదు పొందిన తండ్రీ కొడుకులు వీళ్ళిద్దరే!

[మార్చు] మూలాలు, వనరులు

  • From the Report submitted by the Telugu Language Committe to Andhra University, 1973: 99.
  • పుటలు:660-661, కీ.శే.గిడుగు వెంకట సీతాపతి,విజ్ఞాన సర్వస్వము,తెలుగు సంస్కృతి,రెండవ సంపుటి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-మార్చి-1985


[మార్చు] బయటి లింకులు

  1. ఈమాట - గిడుగు వెంకట రామమూర్తి రేఖాచిత్రం (1863 - 1940)

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License