Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కాకతీయులు

వికీపీడియా నుండి

కాకతీయ సామ్రాజ్యము
కాకతీయ సామ్రాజ్యము
సామ్రాజ్యము

 

1083 – 1323
 

 

రాజధాని ఓరుగల్లు (వరంగల్)
భాష(లు) తెలుగు
మతము హిందూ మతం
Government Monarchy
History
 - ఆవిర్భావం 1083
 - పతనం 1323
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు ?
దుర్గరాజు 1108-1195
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు ?
రుద్రమ దేవి ?
ప్రతాపరుద్రుడు ?

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు [2]. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే[3]. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారంపొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించినారు [4].

వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).

విషయ సూచిక

[మార్చు] ఆంధ్రాపధంలో కాకతీయుల పూర్వ రంగం

తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు తీరాంధ్రంలో వేంగి చాళుక్య చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది. ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ (బాదామి) చాళుక్యులకు సోదర సమానులు. కాని క్రమంగా దక్షిణాపధం నుండి విస్తరిస్తున్న చోళులు తీరాంధ్రాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకొన్నారు. ఆలా క్రీ. శ. 1076నుండి తీరాంధ్రంలో చాళుక్య చోళ యుగం ప్రారంభమై క్రీ. శ. 1200 వరకు సాగింది. వారికి, సత్యదేవుని నాయకత్వంలోని పశ్చిమ చాళుక్యులకు తరచు యుద్దాలు జరిగాయి. దక్షిణ తీరాంధ్రంలో 11, 12 శతాబ్దాలలో వెలనాటి చోడులు గుంటూరు జిల్లా ప్రాంతంలో చోళులకు సామంతులుగా ఉంటూ పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొన్నారు. క్రీ. శ. 1135లో వేంగిలో జరిగిన యుద్ధంలో గొంకయ అనే వెలనాటి చోళ నాయకుని సైన్యం చేత పశ్చిమ చాళుక్యులు తీవ్రంగా పరాజితులై ఆంధ్ర ప్రాంతంనుండి పూర్తిగా వైదొలగారు. తరువాత వెలనాటి చోళులు దక్షిణ తీరాంధ్రంలో దాదాపు స్వతంత్రులుగా పాలించారు.


తరువాత ఈ ప్రాంతాన్ని (కమ్మనాడు) అంచెలంచెలుగా కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేవాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును కమ్మ నాయకులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారెంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం అప్పటి మత సాంప్రదాయాల మధ్య (శైవులు, వైష్ణవులు), కులాల మధ్య, జ్ఞాతుల మధ్య (నలగామరాజు, మలిదేవరాజు) జరిగిన పెద్ద పోరు. దాదాపు అందరు రాజులూ ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షంలో పాలు పంచుకొన్నారు. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. అరాచకాన్ని అంతం చేసే ప్రభువులకు అది అదనైన సమయం. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.


తెలంగాణా ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర రాజుల పాలనలో లేదు. కొన్ని భాగాలు పశ్చిమ చాళుక్యుల అధీనంలోను, కొన్ని భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను, కొన్ని భాగాలు వేంగి చాళిక్యుల అధీనంలోను ఉన్న సామంతరాజుల పాలనలో ఉండేవి. ముఖ్యంగా వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య ఎడ తెరపి లేకుండా అనేక యుద్ధాలు జరిగాయి. తెలంగాణా లోని వివిధ ప్రాంతాలు పాలకుల మధ్యలో చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు ఐదు వందల యేండ్లు తెలంగాణలో స్వతంత్ర రాజ్యం లేనందున అక్కడ ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది.


క్రీ. శ. 950 - 1100 మధ్య కాలంలో కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులకు, లేదా పశ్చిమ చాళుక్యులకు లేదా తూర్పు చాళుక్యులకు (దశలను బట్టి) సామంతులుగా, ఉద్యోగులుగా ఉండేవారు. క్రీ. శ. 934-945 మధ్య మధిర, మానుకోటలను పాలించిన కాకర్త్య గుండన రాష్ట్రకూటులకు ప్రతినిధి. రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ప్రశంసనీయమైన పాత్ర వహించి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్తులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తీరాంధ్రానికి విస్తరించింది.

[మార్చు] కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు

కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు వివాదాస్పదము. వీరునూ చాళుక్యుల వలెనే కర్ణాట దేశమునకు చెందినవారని ఒక అభిప్రాయము[5]. క్రీ.శ. 950లో తూర్పు చాళుక్య రాజు వేయించిన దానార్ణవుని మాగల్లు శాసనం ప్రకారం "గుండియ రాష్ట్రకూటుని ప్రపౌత్రుడు కాకత్య గుండ్యన". (గుండియ కొడుకు ఎరియ రాష్ట్రకూటుడు. అతని కొడుకు బేతియ. అతని కొడుకు కాకత్య గుండన). ఈ "రాష్ట్రకూట" పదం ఆధారంగాను, రాష్ట్రకూటుల గరుడ లాంఛానాన్ని ధరించినందువల్లా కాకతీయులు మహారాష్ట్రములోని నాందేడ్ ప్రాంతంనుండి వచ్చి తెలంగాణ ప్రాంతంలో రాజోద్యోగులుగా స్థిరపడ్డారని చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయ పడ్డాడు. అయితే వీరు తమ ప్రభువుల పట్ల గౌరవపూర్వకముగా వరాహ లాంఛనాన్ని, రాష్ట్రకూట ఉద్యోగ నామాన్ని ధరించి ఉండవచ్చు. ఎందుకంటే తరువాత కాకతీయులు తూర్పు చాళుక్య రాజులదయన వరాహ లాంఛనాన్ని స్వీకరించారు. అంతే కాకుండా రాష్ట్రకూటులు తాము సూర్య వంశస్తులమని చెప్పుకోగా కాకతీయులు "అత్యర్కేందు కులం" వారని చెప్పబడింది. అనగా కాకతీయులు చాళుక్యులు, రాష్ట్రకూటులవలె సూర్యవంశ, చంద్రవంశ క్షత్రియులు కారు. నాల్గవ వర్గానికి చెందిన కర్షకులు (శూద్రులు, చతుర్ధాన్వయులు). కాకతీయులది కొన్ని తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశము[6].


గణపతి దేవుని చెల్లెలు మైలాంబ క్రీ. శ. 1250లో వేయించిన బయ్యారం చెరువు శాసనములో కాకతీయుల వంశవృక్షం చెప్పబడినది. అందు కాకతీయులకు ఆద్యుడు వెన్న అని, వీరిది దుర్జయ వంశమని చెప్పబడింది. ఈ వంశము వారు 'కాకతీపురవల్లభ' అని చెప్పుకున్నారు. వీరు కాకతి అను దేవతను కొలిచారని లేక కాకతీపురము అను నగరమునకు సంబంధించినవారని చరిత్రకారుల అభిప్రాయము. ఓరుగంటిలో కాకతమ్మ దేవాలయము ఇప్పటికీ ఉన్నది.

[మార్చు] మూడు దశలు

కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి.

  • ఖ్రీ. శ. 1000- 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు మరియు రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్రము నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగా ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది. ప్రజలలోపుట్టి కష్టసుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వాతంత్ర్యముతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్యనీటివనరులు.
  • క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ మరియు తీరాంధ్ర ప్రాంతాలు ఒకే పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గరు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి.
  • ఖ్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు. కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.

[మార్చు] కాకతీయ సామ్రాజ్య క్రమం

[మార్చు] ఆరంభ దశ

ఖ్రీ. శ. 934-945 మధ్యకాలంలో గుండయ రాష్ట్రకూటుల ప్రతినిధి (సామంత రాజు)గా మధిర, మానుకోట తాలూకాలను పాలించేవాడు. అది రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునకు, వేంగి రాజు మొదటి చాళుక్య భీమునకు యుద్ధాలు జరుగుతున్న సమయం. అనంతరం పెరువంగూరు యుద్ధంలో గుండయ మరణించాడు. బెజవాడను పట్టుకోవడంలో గుండన చూపిన సాహసానికి కృతజ్ఞతాపూర్వకముగా రెండవ కృష్ణుడు గుండయ కుమారుడు ఎరియను ఓరుగల్లు దగ్గరలోని కురవాడికి అధిపతిగా చేశాడు. తూర్పుననున్న ముదిగొండ చాళుక్యులను నివారించుటకు ఇది ఉపయోగపడింది[7]. ఎరియ ఓరుగల్లును (కాకతీపురము) రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ఇతని మనుమడు కాకత్య గుండ్యన (ఎరియ కొడుకు బేతన కాలంలో బహుశా మళ్ళీ కురవాడిని చాళుక్యులు ఆక్రమించి ఉండవచ్చును).


దానార్ణవునికి ఆతని సోదరుడు రెండవ అమ్మరాజునకు జరిగిన ఘర్షణలో, మూడవ కృష్ణుని ప్రోద్బలముతో, దానార్ణవుడు వేంగీ సింహాసనము చేజిక్కించుకొనుటకు గుండ్యన సాయపడ్డాడు. ఆ రాజ్యాలలో చెలరేగిన కల్లోలాలను అదనుగా తీసికొని మళ్ళీ కురవాడిని తన అధీనంలోకి తెచ్చుకొని ఉండవచ్చును. అయితే ముదిగొండ చాళుక్యులకు చెందిన "విరియాల ఎర్ర భూపతి" ఒక యుద్ధంలో గుండ్యనను వధించాడు. గుండ్యన కొడుకు గరుడ బేతన చిన్న వయసులో రాజ్యం కోల్పోయి విస్సహాయుడైనాడు. ఎర్ర భూపతి భార్య కామసాని ఆ పిల్లవానిపై జాలిగొని ఓరుగల్లు రాజ్యం ఇప్పించింది. ముందు రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న కాకతీయులు ఇలా విరియాల వారి సౌహార్ద్రత్వంతో చాళుక్యుల సామంతులుగా ఓరుగల్లులో నెలకొన్నారు. బేతన క్రీ. శ. 1052 వరకు రాజ్యం చేశాడు.


బేతరాజు కుమారుడు మొదటి ప్రోలుడు (క్రీ. శ. 1052 - 1076) చాళుక్య యువరాజు ఆరవ విక్రమాదిత్యునికి సహాయపడ్డాడు. స్థానిక ప్రభువులైన అన్నయ్య, గొన్నయ్యలను నిర్జించాడు. ఈతనికి "అరికేసరి" అనే బిరుదు ఉంది. ఇతను అనుమకొండ (హనుమకొండ)ను సోమేశ్వరుడినుండి పొందాడు. ప్రోలుని కుమారుడు రెండవ బేతరాజు (క్రీ. శ. 1076 - 1108) హనుమకొండ రాజధానిగా పాలించాడు. రాష్ట్రకూటులను జయించి కొరవి మండలం, హనుమకొండ విషయం, సబ్బిరాయి మండలాలను కలిపి కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు.


ఈతని తమ్ముడు రెండవ ప్రోలరాజు (క్రీ. శ.1116 - 1157) మిక్కిలి గొప్పవాడు. చాళుక్యులు బలహీనపడిన సమయములో స్వాతంత్ర్యము ప్రకటించుకొని తెలంగాణమంతయూ రాజ్యవిస్తరణ చేశాడు. పశ్చిమ చాళుక్యుల సామంతులైన తైలప దేవుడు (మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రాంతం), గోవిందరాజు (వరంగల్ జిల్లా వేలకొండపల్లి ప్రాంతం), గుండరాజు (మంథెన ప్రాంతం), జగద్దేవుడు (వేములవాడ ప్రాంతం) అనే నలుగురు రాజులను జయించి తెలంగాణములో చాళుక్యుల పాలనను అంతం చేశాడు. ఇతడు కళ్యాణిని పాలిస్తున్న బిజ్జలుని సమకాలికుడు. బిజ్జలునికి సహకారంగా తన సేనను పంపి అతడు కళ్యాణి నగరాన్ని పశ్చిమ చాళుక్యులనుండి వశం చేసుకోవడానికి సాయపడ్డాడు. కాకతీయులు మొదట జైనులు. అప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో జైన మతం బలంగా ఉంది. కాని కళ్యాణిలో బసవని నేతృత్వంలో వీరశైవం విజృంభించి ఆంధ్రదేశంలో బలం పుంజుకోసాగింది. ఉప్పెనలా వస్తున్న వీరశైవానికి తలవంచి రెండవ ప్రోలరాజు శైవాన్ని స్వీకరించాడు. ఈ సమయానుకూల చతురత వల్ల కాకతీయుల రాజ్యం మరో రెండు శతాబ్దాలు కొనసాగగలిగింది. తరువాత రెండవ ప్రోలుడు కృష్ణానదిని దాటి తీరాంధ్ర చోళులను జయించాలని యత్నించాడు. మంత్రకూటమును (నూజివీడు మండలము) పాలించుచున్న గుండని నిర్జించి తన రాజ్యములో కలుపుకున్నాడు. క్రీ. శ. 1158లో వెలనాటిపై చేసిన యుద్ధములో రాజేంద్ర చోడుని చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో కాకతీయుల చరిత్ర మలుపు తిరిగింది[8].

===రుద్రదేవుడు (1158 - 1195)=== (ప్రథమ స్వత0త్ర కాకతీయ సామ్రాజ్యాదిపతి) ప్రసిద్ధులైన కాకతీయులలో రుద్రదేవుడు మొదటివాడు. పరాక్రమ శాలి. రాజనీతి చతురుడు. ఇతనినే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఇతని అనేక శాసనాలలో అనుమకొండ శాసనం (వేయి స్తంభాలగుడి) ప్రసిద్ధమైన చారిత్రికాధారము. రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు. ప్రోలరాజు మొదలుపెట్టిన దిగ్విజయ యాత్రలను ముందుకు తీసుకెళ్ళాడు. పశ్చిమ చాళుక్యుల సార్వభౌమత్వానికి వారసుడుగా బిజ్జలుడు కాకతీయులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మరో ప్రక్క కాకతీయుల విజృంభణపై అసూయాగ్రస్తులైన చాళుక్య సామంతులు కాకతీయులపై కత్తిగట్టారు. అసమానమైన రాజనీతితో వీరందరిని ఎదుర్కొని రుద్రదేవుడు కాకతీయులకు సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాడు.


మేడరాజు, దొమ్మరాజు, మైలగి దేవుడు, చోడోదయుడు వంటి చిన్న చిన్న స్థానిక రాజులను జయించాడు. తరువాత తీరాంధ్రంవైపు దృష్టి సారించాడు. క్రీ. శ. 1162లో వెలనాటిపై దండయాత్ర చేసి శ్రీశైలం, త్రిపురాంతకం ఆక్రమించుకొన్నాడు. పలనాటి యుద్ధంలో నలగామరాజుకు సాయంగా పెద్ద దళాన్ని పంపాడు. పల్నాటి యుద్ధంలో వెలనాటి చోళులు బలహీనపడిన తరువాత క్రీ. శ. 1186లో రుద్రదేవుడు ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించుకొని రెండవ ప్రోలుని మరణానికి ప్రతీకారం తీర్చుకొన్నాడు. తరువాత దేవగిరి రాజైన జైతుగి తో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు. రుద్రదేవుడు ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా నిర్మించడం మొదలుపెట్టాడు. అనుమకొండలో దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడు భాషాభిమాని. స్వయంగా కవి.

[మార్చు] మహాదేవుడు (1195 - 1199)

రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు (క్రీ. శ. 1195 - 1198) దేవగిరి యాదవులపై పగసాధించవలెనని ప్రయత్నించి విఫలుడయ్యాడు. రుద్రునికి సంతానం లేనందున మహాదేవుని కొడుకు గణపతిదేవుని దత్తత తీసికొన్నాడు. బహుశా రుద్రదేవుడు మరణించినపుడే గణపతిదేవుడు దేవగిరి యాదవులకు బందీగా చిక్కి ఉంటాడు. అతనిని విడిపించే ప్రయత్నంలోనే మహాదేవుడు దేవగిరిపై దండెత్తి ఆయుద్ధంలో (ఏనుగు మీద ఉండి యుధ్ధాన్ని నడిపిస్తూ) మరణించాడు. మహాదేవుడు శైవ మతాబిమాని. ధృవేశహవర పండితుడు అతని దీక్షా గురువు.


మహాదేవుని మరణానంతరం క్రీ. శ. 1198లో మహాదేవుని కొడుకు (రుద్రదేవుని దత్తపుత్రుడు) గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు.

===గణపతిదేవుడు (క్రీ. శ. 1199 - 1262)=== (కాకతీయ సామ్రాజ్యాధిపతి) గణపతి దేవుడు రాజ్యానికి రావడానికి ముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవులకు బందీగా ఉండి విడుదల చేయబడ్డాడు. ఈలోగా కాకతీయ సామంతులు చేసిన తిరుగుబాట్లను రేచర్ల రుద్రుడు అనే విశ్వాసపాత్రుడైన సేనాని అణచి రాజ్యాన్ని గణపతిదేవునికి అప్పగించాడు. గణపతిదేవుడు మహావీరుడు. దూరదృష్టి ఉన్న రాజనీతిజ్ఞుడు. అప్పటికి దక్షిణాన పాండ్యులు, పశ్చిమాన హొయసల, యాదవ రాజులు, ఉత్తరదేశంలో తురుష్కులు బలవంతులై ఆంధ్రప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాగల ప్రమాదాన్ని గుర్తించిన గణపతిదేవుడు ఆంధ్రదేశాన్ని ఐక్యము చేయడానికి విజయయాత్రలు ప్రారంభించాడు. అయితే ఓడిపోయిన రాజులను తొలగించలేదు. వారితో సంబంధాలు కలుపుకొని వారి సామంత ప్రతిపత్తిని కొనసాగించాడు. ఈ సామంతులు కాకతీయులకు అండగా నిలిచారు.


గణపతిదేవుడు క్రీ. శ. 1212 - 1213 కాలంలో తూర్పు తీరంపై దండెత్తి కృష్ణా, గోదావరి, గుంటూరు ప్రాంతాలను స్వాధీనం చేసుకొన్నాడు. నిడదవోలు పాలకుడైన వేంగి చాళుక్య వీరభద్రునికి (క్షత్రియుడు) తన కుమార్తె రుద్రమ్మను ఇచ్చి పెండ్లి చేశాడు. రెండవ కుమార్తె గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు, సోదరి మేలాంబికను మధిర పాలకుడు రుద్రరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. కమ్మనాడుకి చెందిన జాయపసేవాని ఇద్దరు చెల్లెళ్ళను (పిన్నచోడుని కుమార్తెలైన నారమ్మ, పేరమ్మ) గణపతిదేవుడు వివాహం చేసుకొన్నాడు. జాయపసేనానిని తన గజసైన్యాధ్యక్షునిగా ఓరుగల్లు తీసుకెళ్ళాడు. నెల్లూరు ప్రాంతాన్ని జయించి అక్కడి పూర్వపాలకుడైన మనుమసిద్ధికి ఇచ్చాడు. రాయలసీమ ప్రాంతాన్నంతా జయించి గంగయ సాహిణి అనే సామంత పాలకునికి అధికారం అప్పజెప్పాడు. తర్వాత కళింగ దేశంలోని గంజాం జిల్లా ఆస్కావరకు జయించాడు.

అప్పటికి కుల వ్యవస్థ, కులాల మధ్య అంతరాలు బలపడుతున్నాయి. కాని గణపతిదేవుడు అందరు కులాలతో సంబంధ బాంధవ్యాలు నెరపుకొంటూ ఈ కుల భేదాలు అంతఃకలహాలుగా మారకుండా జాగ్రత్త పడ్డాడు. జాయపసేవావి కమ్మ వంశస్తుడు. రేచర్ల రుద్రుడు పద్మనాయకుడు. చాళుక్య వీరభద్రుడు క్షత్రియుడు. నెల్లూరుకు చెందిన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్ళి గణపతిదేవుని ఆస్థానంలో తన మహాభారత రచన పూర్తి చేశాడు.

నెల్లూరు రాజ్యంలో కాకతీయుల జోక్యం వలన వారికి పాండ్యులతో వైరం ఏర్పడింది. పాండ్యులు రెండు సైన్యాలను పంపారు. కొప్పెరుంజింగలి నాయకత్వంలోని ఒక సైన్యం కాకతీయులతో యుద్ధంలో ఓడిపోయింది. పాండ్యుల రెండవ సైన్యం జటానర్మ నాయకత్వంలో నెల్లూరుపై దాడిచేసింది. క్రీ. శ. 1263లో ముటుకూరు వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ-శేవుణ సైన్యాలు ఓడిపోయాయి. ఈ యుద్ధంలో మనుమసిద్ధి మరణించాడు. నెల్లూరు రాజ్యం పాండ్యుల వశమయ్యంది. ఇది కాకతీయులకు ఘోర పరాజయం. ఇదొక్కటే గణపతిదేవుడు యుద్ధాలలో చవి చూసిన ఓటమి. అప్పటికే గణపతిదేవుడు బాగా వృద్ధుడై యున్నాడు. తరువాత ప్రతాపరుద్రుని కాలం వరకు నెల్లూరును కాకతీయులు వశపరచుకోలేకపోయారు.

గణపతిదేవుని కాలంలో ఓరుగల్లు ఆంధ్రనగరి అయ్యింది. పెక్కు తటాకాల, ఆలయాల నిర్మాణం జరిగింది. అనేక గణపవరాలు వెలిశాయి. విదేశీ వాణిజ్యం వర్ధిల్లింది. మోటుపల్లి రేవు ప్రసిద్ధిగాంచింది. శిల్ప వాస్తువు ప్రభవించింది. రామప్ప దేవాలయనిర్మాణం ఈ కాలంలో జరిగినదే.

[మార్చు] రుద్రమదేవి (1269 - 1289)

రాణి రుద్రమ దేవి
ప్రధాన వ్యాసం: రుద్రమ దేవి

గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. ఆంధ్రదేశమంతటినీ ఒక స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో సమర్ధవంతంగా పాలించడం వలన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో ముఖ్యమైనది.


రుద్రమదేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే సరిపోయింది. రుద్రమదేవికి ముందుగా స్త్రీ పరిపాలన సహించని సామంతులనుండి, దాయాదులనుండి ప్రతిఘటన ఎదురయ్యింది. అదే సమయంలో దేవగిరి యాదవరాజు దండెత్తి వచ్చాడు. ఈ రెండు విపత్తులనూ ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఈ పోరాటాలలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వారిలో కొందరు - గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు (వెలమ), రుద్రనాయకుడు (కమ్మ), జన్నిగదేవుడు (కాయస్థుడు), త్రిపురాంతకుడు (కాయస్థుడు) మరియు బెండపూడి అన్నయ్య (బ్రాహ్మణుడు).


తరువాత తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని (క్రీ. శ. 1262లో) ఆక్రమించాడు. కాని పోతినాయక, ప్రోలినాయకులు వారిని ఓడించి క్రీ.శ. 1278లో వేంగిలో తిరిగి కాకతీయుల అధికారం నెలకొల్పారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు దండెత్తాడు. అతనినోడించి రుద్రమదేవి పరిహారాన్ని గ్రహించింది. దక్షిణాదిన నెల్లూరు ప్రాంతంలో పాండ్యులు విజృంభించసాగారు. వారిని ఓడించిననూ అక్కడ కాకతీయాధికారం ఎంతో కాలం నిలువలేదు. పాండ్యుల సామంతులైన తెలుగు చోడులు మళ్ళీ నెల్లూరును ఆక్రమించారు. వల్లూరు రాజ్యం మాత్రం పాండ్యులనుండి కాకతీయుల వశమైంది. దానిని జన్నిగదేవుడు, తరువాత త్రిపురారి కాకతీయుల సామంతులుగా ఏలారు. అయితే త్రిపురారి తరువాత వచ్చిన అంబదేవుడు తిరుగుబాటు చేసి స్వతంత్రరాజ్యం స్థాపించ ప్రయత్నించాడు. అంబయతో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది(క్రీ. శ. 1289).


నిరంతరం యుద్ధాలలో ఉన్నాగాని రుద్రమదేవి చాలా సమర్ధవంతంగా పాలన నిర్వహించింది. ఓరుగల్లుకోటను దుర్భేద్యంగా బలపరచింది. దేశం సుభిక్షంగా ఉంది. ఆమె కాలంలోనే వెనిస్ యాత్రికుడు మోటుపల్లి రేవులో దిగాడు. దేశంలో పాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమలు, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయని వర్ణించాడు.

[మార్చు] ప్రతాపరుద్రుడు (1289 - 1323)

ప్రధాన వ్యాసం: ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. క్రీ. శ. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది. అంబదేవుని, నెల్లూరులో మనుమగండుని, కర్ణాట రాజులను జయించి రాజ్యము కట్టుదిట్టము చేశాడు. ఇంతలో ఉత్తర దేశమునుండి కొత్త ఉపద్రవము ముంచుకొచ్చింది. క్రీ.శ. 1309, 1318, 1320 లో ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖిల్జీ మూడు సార్లు దాడి చేసి విఫలమయ్యాడు[9]. క్రీ. శ. 1323లో జరిగిన నాలుగవ యుద్ధములో ప్రతాపరుద్రునికి అపజయము సంభవించింది[10].

[మార్చు] కాకతీయ రాజ్య పతనము

[మార్చు] కాకతీయుల అనంతర పరిణామాలు

[మార్చు] ముసునూరి నాయకులు

ప్రధాన వ్యాసం: ముసునూరి నాయకులు

ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి[11].

[మార్చు] విజయనగర రాజ్య స్థాపన

[మార్చు] కాకతీయులనాటి సమాజం

[మార్చు] ఆర్ధిక రంగం, జీవనం

[మార్చు] శిల్పం, సాహిత్యం, కళలు

కాకతీయులనాటి మంటపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో భద్రపరచబడినది. (మ్యూజియం వారి సౌజన్యంతో ఫొటో తీయబడినది)


[మార్చు] సంస్కృతి, మతం, కులం

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలములు

  1. Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London
  2. కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad
  3. Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur
  4. ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు
  5. కాకతీయులు - పి.వి.పరబ్రహ్మశాస్త్రి (తెలుగు అనువాదము)
  6. విజ్ఞాన సర్వస్వము, దేశము-చరిత్ర, మూడవ సంపుటము, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు
  7. Altekar, A.S. The Rashtrakutas and Their Times, Oriental series No. 36, Oriental Book Agency, Poona, 1934
  8. Rao, M.R. Glimpses of Dakkan History, Orient Longmans Limited, Madras, 1951
  9. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము, సి. వి. రామచంద్ర రావు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు
  10. Pre-colonial India in Practice, Cynthia Talbot, 2001, Oxford University Press, pp.177-182, ISBN 0195136616
  11. Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair

[మార్చు] వనరులు

  • Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942
  • A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p.160, ISBN 0415154820
  • A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 16-20, ISBN 0521254841

[మార్చు] బయటి లింకులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License