Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఏలూరు

వికీపీడియా నుండి

  ?ఏలూరు మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఏలూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఏలూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°42′N 81°06′E / 16.7, 81.1
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఏలూరు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 18
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
285,900 (2001)
• 140924
• 144976
• 78.94
• 84.15
• 73.91

అక్షాంశరేఖాంశాలు: 16°42′N 81°06′E / 16.7, 81.1

ఏలూరు (Eluru, Ellore), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము. మద్రాసు - కలకత్తా జాతీయ రహదారి (NH5) లో ఏలూరు పట్టణం విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు పట్టణాల మధ్య ఉంది. జిల్లా కేంద్రమైనందున ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగాను మరియు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా అవసరాల కేంద్రంగా ఉంటున్నది. వరి, కూరగాయలు, పుగాకు వర్తకం, చేపల ఎగుమతి, సి.ఆర్.రెడ్డి కాలేజి, అంబికా దర్బార్ బత్తి, జూట్ మిల్లు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించ దగిన అంశాలు.

ఏలూరు ప్రస్తుతం ఒక మునిసిపల్ కార్పొరేషన్, మండల కేంద్రం, జిల్లా కేంద్రం, అసెంబ్లీ నియోజక వర్గం, పార్లమెంట్ నియోజక వర్గం కూడాను.

విషయ సూచిక

[మార్చు] పట్టణం స్వరూపం, జనాభా

ఏలూరు ఒక మునిసిపల్ కార్పొరేషన్. 2001 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు పట్టణ జనాభా 1,89,772. పరిసర ప్రాంతాలతో కలిపి (agglomeration) జనాభా 215,343. ఏలూరును సంస్కృతీకరించి హేలాపురి అని పిలుస్తారు. ఏలూరు పట్టణానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది.

మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండు గా చీలుతుంది(అశోక్ నగర్ వద్ద). ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు పట్టణం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.


కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కలిసి కొల్లేరులో కలవడానికి సాగుతాయి. ఈ కాలువల సంగమం గురించి వేమూరి వెంకటేశ్వరరావు "ఈమాట" అంతర్జాల పత్రికలో "మరపురాని స్మృతులు" అనే వ్యాసంలో ఇలా వ్రాశాడు -

మా ఊరికి చుట్టూ మూడు పెద్ద ఏరులున్నాయి. అందుకనే మా ఊరిని ఏరులూరు అని అంటారు. ... తరవాత పండితులెవరో హేలాపురి అని సంస్కృతీకరించారు కూడాను. కృష్ణ, గోదావరీ నదుల సంగమం మా ఊరి కాలవ. తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం. ఆ రెండునదులూ కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తె రాంగానే, కాలవ వదిలే వాళ్ళు. మళ్ళీ ఇంచక్కా కొబ్బరికాయలు, అరిటిపళ్ళ పడవలూ తూర్పునించి పడమరకీ, పడమటినుంచి తూర్పు వేపుకీ వెళ్ళేవి. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు, ఎండా కాలంలో మంచినీటి కరువు రాకండా! ఇప్పుడు ఆ గొడవే లేదు. కాలవలో సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడూ ఉండవు. కాలవలో పడవలు లేవు. పంపుల చెరువులు పూడి పోతున్నాయి.[1]

తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో షుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. FCI గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి.


1901లో పట్ణ జనాభా 33,521 మాత్రమే ఉండేది. 1991 నాటికి ఇది 2,12,866 కు చేరుకొంది. 1991 లెక్కల ప్రకారం అక్షరాస్యత 72%. 1981-91 మధ్యకాలంలో 26.63% అక్షరాస్యతా వృద్ధి నమోదయ్యింది. 2001లో జనాభా 2,15,642.


భౌగోళికంగా ఏలూరు అక్షాంశ రేఖాంశాలు 16.7° N 81.1° E[2]. సముద్ర తలం నుండి ఎత్తు 22 మీటర్లు. (72 అడుగులు). బంగాళాఖాతం తీరం నుండి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటాయి. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీలు సెంటీగ్రేడ్.

ఏలూరు పెద్దబజారు
ఓవర్ బ్రిడ్జి పైనుండి దృశ్యం
ఫైర్ స్టేషన్ సెంటర్
రమామహల్ సెంటర్

[మార్చు] చరిత్ర

హేలాపురి (ఏలూరు) పాత కాలంనుండి వేంగి అను రాజ్యములో భాగముగా ఉన్నది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 700 నుండి 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు (హేలపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతముగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగముగా ఉన్నది. ఆ తరువాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉన్నది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి మరియు గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు కలవు.


బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామఅలు ఏలూరు పట్టణంలో కలుపబడ్డాయి. ఆ విధంగా పట్ణ జనాభా 3,50,000కు చేరుకొంది.

[మార్చు] ముఖ్య ప్రాంతాలు

ఏలూరు పట్టణం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణంలో ప్రధాన విభాగాలు

  • వ్యాపార కేంద్రాలు: పెద్ద బజారు, రమామహల్ సెంటరు
  • ప్రయాణ కేంద్రాలు: పెద్ద స్టేషను, పవర్ పేట స్టేషను, క్రొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు
  • వైద్య కేంద్రాలు: రామ చంద్రరావు పేట, వెంకట్రావు పేట, పెద్దాసుపత్రి
  • కూడళ్ళు: వసంత మహల్ సెంటరు, రమామహల్ సెంటరు, మధులత సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటరు
  • ప్రధాన నివాస కేంద్రాలు: నరసింహారావు పేట, రామచంద్రరావు పేట, శాంతినగర్,
  • పట్టణంలో కలిసిపోయిన పరిసర గ్రామాలు: తంగెళ్ళమూడి, సత్రంపాడు, గవరవరం, శనివారపుపేట

[మార్చు] రవాణా, కమ్యూనికేషన్

రోడ్డు మార్గాలు

ఏలూరు పట్టణం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి NH5 పై ఉండి, అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సౌకర్యాలు కలిగి ఉంది. ఏలూరు నుండి కొన్ని పట్టణాల దూరాలు - నరసాపురం 70 కి.మీ., తణుకు 75 కి.మీ., భీమవరం 50 కి.మీ., జంగారెడ్డిగూడెం 50 కి.మీ., తాడేపల్లిగూడెం 51 కి.మీ., విజయవాడ 63 కి.మీ., రాజమండ్రి 100 కి.మీ., హైదరాబాదు -- కి.మీ., విశాఖపట్నం -- కి.మీ.

జిల్లా కేంద్రంగా కూడా ఏలూరునుండి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సదుపాయం ఉంది. ప్రయాణీకుల అవసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నడిపే బస్సులే ప్రధాన సదుపాయం. చుట్టుప్రక్కల గ్రామాలకు ఆటోలు, హైదరాబాదు నగరానికి ప్రైవేటు బస్సులు కూడా గణనీయంగా ఉపయోగింపబడుతున్నాయి. ఏలూరు నుండి విజయవాడకు దాదాపు ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉంటుంది. హైదరాబాదుకు ప్రతిరోజూ షుమారు 10 ఆర్.టి.సి. బస్సులు, మరో పది ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి.

పట్టణం లోపల సిటీ బస్సులు కొద్దిగా ఉన్నాయి (5,6 రూటులు) గాని చిన్న పట్టణమైనందున వీటి ప్రాధాన్యత అంతగా కనిపించదు. వూరిలోపల ప్రయాణానికి ప్రైవేటు వాహనాలు (సైకిళ్ళు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు), ఆటోలు, రిక్షాలు అధికంగా వినియోగిస్తారు.


రైలు

మద్రాసు-కలకత్తా బ్రాడ్ గేజి రైలు మార్గం ఏలూరు మీదుగా వెళుతుంది. కొన్ని సూపర్ ఎక్స్‌ప్రెస్‌లు ఏలూరులో ఆగుతాయి. హైదరాబాదు, మద్రాసు, హౌరా మార్గాలలోని స్థానాలకు రైలు ప్రయాణం చేయవచ్చును. ఏలూరులో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఏలూరు స్టేషన్ (దీనినే "పెద్ద స్టేషన్" అంటారు)లో దాదాపు అన్ని రైళ్ళు ఆగుతాయి. కాని ఈ స్టేషన్ పట్టణం సెంటరుకు దూరంగా ఉంది. పవర్‌పేట స్టేషన్‌లో ప్యాసింజరు రైళ్ళు మాత్రం ఆగుతాయి. ఇది పట్టణం నడిబొడ్డున ఉంది.

ట్రాఫిక్ సమస్య

ఏలూరు పట్టణం చాలా కాలంగా రైల్వేగేటుల వలన కలిగే ట్రాఫిక్ అంతరాయాలకు ప్రసిద్ధి చెందింది. జాతీయ రహదారి పట్టణం మధ్యగుండా మెలికలతో వెళ్ళడం ఇందుకు కారణం. విశాఖపట్నం నుండి విజయవాడకు జాతీయ రహదారిలో ప్రయాణించే వారికి పెద్ద స్టేషన్, (పాత) బస్ స్టాండు, ఫైర్‌స్టేషన్, వట్లూరు - అనే నాలుగు గేట్లవద్ద ప్రయాణానికి అంతరాయం కలుగుతూ ఉండేది. రోడ్డు మార్గం జాతీయ రహదారి. రైలు మార్గం ట్రంక్ లైను. పట్టణమేమో జిల్లా కేంద్రం. కనుక రెండు మార్గాలలోనూ ట్రాఫిక్ చాలా హెచ్చు. వీటికి తోడు పవర్‌పేట, ప్రెస్‌గేటుల వద్ద ఉన్న రైల్వే గేటులు పట్టణం లోపలి ట్రాఫిక్‌కు అడ్డంకిగా నిలిచేవి. 1970 లో ఓవర్ బ్రిడ్జి కట్టిన తరువాత పట్టణం నడిబొడ్డున ఉన్నట్రాఫిక్ కొంత సజావుగా అయ్యింది గాని మిగిలిన గేట్లు అలానే ఉండేవి. కనుక బైపాస్ రోడ్డు ఏలూరు పట్టణవాసుల చిరకాల వాంఛగా చాలాకాలం తీరలేదు. మధ్యలో మినీ బైపాస్ ఒకటి నిర్మించారు. తరువాత 2005 నాటికి 17 కి.మీ. బైపాస్ రోడ్డు నిర్మించాక ఈ సమస్య చాలా వరకు అదుపులోకి వచ్చింది. 2007లో ప్రెస్ గేటు వద్ద "అండర్ పాస్" నిర్మించారు. వీటితో గేట్ల సమస్య చాలావరకు కొంత పరిష్కారమైంది కాని పెరుగుతున్న పట్టణం ట్రాఫిక్ కారణంగా ఇతర సమస్యలు (పార్కింగ్, సిగ్నల్స్, ఇరుకు దారులు వంటివి) మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

వాయు మార్గం

విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఇక్కడినుండి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలకు ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి (ఎయిర్ డెక్కన్ లేదా కింగ్‌ఫిషర్ సంస్థల ద్వారా).

కమ్యూనికేషన్

చాలా కాలంనుండి టెలిఫోన్, టెలిగ్రాఫ్ సౌకర్యాలున్నాయి. మారుతున్న కమ్యూనికేషన్ రంగం వల్ల సెల్‌ఫోనుల వినియోగం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ వంటి సదుపాయాలు, కేబుల్ టెలివిజన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

[మార్చు] విద్యా సదుపాయాలు

ఏలూరులోని విద్యా సంస్థలు ఏలూరు పట్ణం యొక్క, మరియు పరిసర ప్రాంతాల యొక్క విద్యావసరాలకు ప్రధాన వనరులు. వాటిలో కొన్ని ఇక్కడ చెప్పబడ్డాయి.

  • "శ్రీమతి ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ హైస్కూల్" చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల. పాఠశాలలు తక్కువగా ఉన్నప్పటి కాలం నుండి పట్టణంలో చాలా మందికి ఇక్కడ చదువుకొనే అవకాశం లభించింది.
  • "శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం హైస్కూలు" కూడా చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల.
  • "సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు" - ఏలూరు పట్టణంలోను, పరిసర ప్రాంతాలలోను ఉన్న విద్యార్ధుల ఉన్నత విద్యావసరాలకు చాలాకాలంగా సర్.సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యంలో నడుస్తున్న సంస్థలు ఉపయోగకరంగా ఉంటున్నవి. 1930 దశకంలో ప్రాంభమైన ఈ కాలేజి నుండి అనేకులకు మంచి ప్రమాణాలతో ఉన్నత విద్య లభించింది. ప్రస్తుతం జాతీయ విద్యా ప్రమాణాల అంచనా మరియు ప్రామాణిక నిర్ధీకరణ మండలి (NAAC) వారిచే ఇది 'A' గ్రేడ్ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయం సమాన హోదా (deemed university) సాధించాలనే కృషి జరుగుతున్నది. ఈ సంస్థలచే నిర్వహింపబడుతున్న విద్యాలయాలు: పబ్లిక్ స్కూలు, మోడల్ హైస్కూలు, జూనియర్ కాలేజి, డిగ్రీకాలేజి, పి.జి. కాలేజి, లా కాలేజి, బి.ఎడ్. కాలేజి. వీరి మహిళల కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి ఏలూరు పరిసర గ్రామమైన వట్లూరులో ఉన్నాయి.
  • "సెయింట్ థెరిసా విద్యా సంస్థలు" - సెయంట్ థెరిసా విద్యా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుపిల్లల విద్యాభివృద్ధికి ఎంతో చేయూతనిచ్చాయి. వీటిలో బాలికల పాఠశాల, హైస్కూలు, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, పి.జి. కాలేజి ఉన్నాయి.
  • "ఆశ్రమ్ మెడికల్ కాలేజి" - (దెందులూరు వద్ద)
  • "సి.ఎస్.ఐ. విద్యా సంస్థలు" - వీరి ద్వారా ఒక ప్రాధమిక పాఠశాల, ఒక హైస్కూలు నడుపబడుతున్నాయి.
  • "దివ్య జ్ఞాన సమితి వారి విద్యా సంస్థలు" ద్వారా K.P.D.T. హైస్కూలు, S.P.D.B.T. జూనియర్ కాలేజి నడుపబడుత్ున్నాయి.
  • "సెయింట్ జేవియర్స్ వారి విద్యా సంస్థలు" - పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ముందుకాలం నుండి ఉన్న విద్యా సంస్థలలో ఒకటి. వీరి ద్వారా ఒక ప్రాధమిక పాఠశాల, ఒక హైస్కూలు, ఒక ఐ.టి.ఐ. నడుపబడుతున్నాయి.
  • ఇతర విద్యా సంస్థలు - సెయింట్ జాన్స్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, వేగేస్ని సూర్యనారాయణరాజు కంప్యూటర్ విద్య అకాడమీ (పాలగూడెం).
  • రాష్ట్రమంతటిలాగానే ఇటీవల ప్రైవేటు విద్యా సంస్థలు బహుళంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా ఇంటర్మీడియట్ స్థాయి బోధన వీటిలో జరుగుతున్నది. చైతన్య, సిద్ధార్ధ, నారాయణ, హేలాపురి, శ్రీశ్రీ - ఇవి కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు. అలాగే ప్రైవేటు రంగంలో కంప్యూటర్ విద్యనందించే సంస్థలు కూడా చాలా ఉన్నాయి.

[మార్చు] వైద్య సదుపాయాలు

  • ప్రభుత్వ ఆసుపత్రి - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (పెద్దాసుపత్రి) 350 పడకలతో అన్ని సదుపాయాలతో సమీప ప్రాంతాల వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నది.
  • ఆశ్రమ్ వైద్య కళాశాల ఆసుపత్రి - మెడికల్ కాలీజికి అనుబంధంగా ఉన్నది. 500 పడకలతో ముఖ్యమైన అన్ని సదుపాయాలతో నిర్మింపబడింది.
  • ప్రైవేట్ హాస్పిటళ్ళు - అన్ని రంగాలలోనూ వైద్య సదుపాయాలు కలిగించే ప్రైవేటు హాస్పిటళ్ళు, డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఎక్కువ హాస్పిటళ్ళు రామచంద్రరావు పేట, రమా మహల్ సెంటర్ ప్రాంతంలో ఉన్నాయి. ఇటీవల కొన్ని హాస్పిటళ్ళు సదుపాయాలను విస్తృతపరచి కార్పొరేట్ మెడిసిన్ స్థాయికి ఎగబ్రాకుతున్నాయి.

[మార్చు] వ్యాపారం, పరిశ్రమలు

పరిశ్రమల పరంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఏలూరులో వ్యాపారం అధికంగా రెండు రంగాలలో కేంద్రీకృతమయ్యింది - (1) చుట్టుప్రక్కల లభించే వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం - ధాన్యం, కూరగాయలు, పుగాకు, చేపలు, వంట నూనెలు వంటివి (2) పట్టణంలోను, చుట్టుప్రక్కల గ్రామాలలోను ఉన్న ప్రజల వినియోగవసరాలు తీర్చే వ్యాపారాలు - పచారి సరుకులు, బట్టలు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, గృహనిర్మాణావసరాలు, ఆభరణాలు, ఆర్ధిక సేవలు (బ్యాంకులు, తాకట్టు వ్యాపారం, ఫైనాన్సింగ్) వంటివి. ఇటీవల విద్య, వైద్య సదుపాయాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పెట్రోలు వంటివి కూడా ఈ వ్యాపారాలలో చేరాయని చెప్పవచ్చును.


  • ఏలూరు తివాచీ, చేనేత పరిశ్రమలు - ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి. ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి.
  • అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. షుమారుగా 5000మందికి దీని ద్వారఅ ఉపాధి లభిస్తున్నది.
  • జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్ణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. షుమారు 5000 మంది కార్మికులు ఉపాధి కలిగిస్తుంది. గోనె సంచులు, మరియు ఇతర జనుము ఉత్పత్తులు వీరి ఉత్పఅదనలు.
  • గుప్తా గ్రూప్ - ప్రధానంగా ఎగుమతి వాణిజ్యం నిర్వహిస్తున్నారు. వెండ్రుకలు, తివాచీలు, ఇతర వ్యవసాయోత్పత్తులు.
  • రఘు రెఫ్రిజిరేషన్ ‍ ‍మరియు ఎయిర్ కండిషనింగ్ వర్క్‌షాపు
  • ఇతరాలు - మిరప పొడి, పుగాకు, జీడిమామిడి, దినుసులు, ఉల్లి, పచ్చల్ళు, మామిడికాయలు, బియ్యం వంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే లేక విక్రయించే సంస్థలున్నాయి.

ఏలూరులో వ్యాపారం ప్రధానంగా పెద్దబజారులోను, సమీప పంరాంతంలోను కేంద్రీకృతమై ఉంది. రమామహల్ సెంటర్ రెండవ వాణిజ్య కేంద్రం అని చెప్పవచ్చును.

[మార్చు] వినోదం

  • జిల్లాలోనే పెద్దదైన అల్లూరి సీతారామరాజు స్టేడియం కలదు.

[మార్చు] ఆలయాలు, చర్చిలు, మసీదులు

ఆలయాలు
  • వెంకటేశ్వర దేవస్థానం, వెంకట్రావుపేట
  • శివాలయం
  • సాయిబాబా గుడి
  • దత్త క్షేత్రం
చర్చిలు
  • ఏలూరు డయోసీస్ అధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మరియు తూర్పు గోదావరి జిలల్లాలోని అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం మండలాల కాథలిక్ చర్చిల, ఇతర కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. [3] జేవియర్ నగర్‌లోని బిషప్ బంగళా, చర్చి అందమైన నర్మాణాలు.
మసీదులు

[మార్చు] పరిసర ప్రాంతాలు, ఉత్సవాలు

ఏలూరు పరిసరాలలో ప్రాముఖ్యత కలిగిన లేదా చూడ దగిన విశేషాలు. వివరాలకు ఆయా వ్యాసాలను చూడండి.

ఉత్సవాలు

[మార్చు] ఇతర సదుపాయాలు

  • అల్లూరి సీతారామరాజు స్టేడియం
  • సినిమా థియేటర్లు - కల్పన, అంబిక(3), విజయలక్ష్మి(3), సత్యనారాయణ(2), క్రాంతి, సాయిబాలాజి (2), పాండురంగా, శ్రీనివాసా, గోపాలకృష్ణ
    (మూసివేసిన థియేటర్లు - వెంకటేశ్వర, వెంకట్రామా, విశ్వశాంతి, రమామహల్, వేదరాజ్, రామకృష్ణ, కేసరి)

[మార్చు] ఇతరాలు

  • పడుపు వృత్తి కోసం ఏలూరులో జరుగుతున్న మహిళల "వేలంపాట"ల గురించి తీవ్రమైన విమర్శలున్నాయి. ఈ విషయమై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ - 1998 డెసెంబరు 4,5)[3]

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • ఏలూరు

[మార్చు] గ్రామాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు


[మార్చు] వనరులు, మూలాలు

  1. "ఈ మాట" అంతర్జాల పత్రికలో వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం. ఈ రచయిత వికీ సభ్యులు కూడాను.
  2. Falling Rain Genomics, Inc - Eluru
  3. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ - 1998 డెసెంబరు 4,5 - The Indian Express today reported that at an auction at Eluru a few days ago, eight young women in the age group of 16-30 years were sold to bidders. The report also said that it's a practice among the Dommara and Bhogam communities to conduct quarterly auction of young women, to be sold for a one-year contract for prostitution. The biddings range from Rs 5,000 to Rs 30,000, the report said. Parliament was today overcome with shock and anguish over the exclusive report appeared in this newspaper. In the Rajya Sabha, the Elders came together, cutting across party lines, to condemn the incident, and demanded an inquiry into it .... Amidst shouts of "shame, shame," ...said it was painful and shocking that women were being sold into prostitution for Rs 5,000. [1] [2]


"http://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License