అమృతం కురిసిన రాత్రి
వికీపీడియా నుండి
అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ద తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్ధకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపధ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. [1]
- ఇందులో ఉన్న కవితా ఖండికల పేర్లు
-
- ఆర్తగీతం, సి.ఐ.డి., రిపోర్ట్, వెళ్ళిపొండి - వెళ్ళిపొండి, టులాన్ మాగ్నకార్టా, గొంగళి పురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవు పట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్ధన, మైనస్ ఇంటూ ప్లస్
విషయ సూచిక |
[మార్చు] కొన్ని వ్యాఖ్యలు
- ఆధునిక వచన కవిత్వంలో ఇదొక గొప్ప ఖండిక. .. కవిత్వంలో అత్యంత కారుణ్య భావపూరితాలూ, ప్రజాశక్తిని పరిదీప్తం చేసే చైతన్య శిఖలూ, రసార్ద్ర భావనోద్దీప్తి కలిగిన సుందర దుమధుర రసగుళికల సమాహారమే తెలుగు కవిత్వ ప్రియులకు తిల్ అందించిన "అమృతం కురిసిన రాత్రి" [1]
- “ఒక నిశార్ధ బాగంలో నక్షత్ర నివహగగనం
- ఓరగా భూమ్మీదకు ఒంగి ఎదో రహస్యం చెప్తున్న వేళ
- ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను”
- ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉందును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే. ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వం గా కూడా అనిపించనూ వచ్చు.[2]
- కనురెప్పల మాటున మెరుపువీణలు మీటిన - 'అమృతం కురిసిన రాత్రి - ఆధునిక కవితారంగంలో ముగ్గురిని ప్రముఖంగా పేర్కొనాలి. వారి కవితా సంపుటాలు రాకుండానే వారికి దేశం పట్టనంత పేరొచ్చింది. ఆ ముగ్గురు- తిలక్, శ్రీశ్రీ, అజంతాలు. . తిలక్ శైలీ రమ్యత, తీసుకున్న వస్తువులు అన్నీ కూడా కవితాప్రియుల మన్ననలు పొందాయి. ఆయన వచనకవితా ప్రక్రియను పరిపుష్ఠం చేశారు. ఆయన శైలి రమ్యత పద్యకవితాభిమానులను సైతం ఆకట్టుకుంది. అంతేకాదు కవిత్వం అంటే ఇష్టంలేని వారికి కూడా అది చేరువైంది. ఆయన తన కవిత్వాన్ని నిర్వచించే కర్తవ్యంలో భాగంగానే ఈ సంపుటిలోని తొలికవిత రాశారు. తన కవిత్వానికి వెనుక ఏతత్వం లేదని అంటారు. ప్రత్యేకించి ఏ వాదాన్ని సమర్థించనంటారు. అలాగే అయోమయం సృష్టించడం తన అభిమతం కాదంటారు. ఇక తన కవిత్వంలోని సుందర చిత్ర విచిత్రాలేమిటో చెబుతూ 'గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ, జాజిపువ్వుల అత్తరుదీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలూ'... ఇవన్నీ ఆయన కవితా చంద్రశాలలోని విశేషాలే. ... అమృతం కురిసిన రాత్రి'లో అందరూ నిద్రపోతుంటే ఆయన జీవితాన్ని హసన్మందార మాలగా భరించారు..... అమృతం కురిసిన రాత్రి' చదివితే ఎవరికైనా కవితామృతం గ్రోలినంతానందం కలుగుతుంది. ఉత్తేజంతో కొత్త వెలుగుతో జీవితాన్ని సరికొత్తగా చూడగల నేర్పు అలవడుతుంది. [3]
'అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నాకళా కరవాల ధగద్ధగ రవాలు'
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన 'నా కళా 'కరవాల' ధగద్ధగరవాలు' అన్నారు. ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అన్న అంశాన్ని ఇందులో చాలా స్పష్టం చేశారు. ఆ కవితలోనే ఇంకా అంటారు -
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'
ఈ మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు. [3]
[మార్చు] రచననుండి ఉదాహరణలు
ధాత్రి జనని గుండెలమీద
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా?
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, కాదు సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం
జ్వలత్కాష్ఠమిలాతలం
శప్తధాత్రి నిర్జనమై, స్మశానమై పరచుకొనెను
సుప్తదేవ హృదయ సృజ్ఞాళము లెగిరిపడెను
అక్కయ్యకు రెండో కానుపు
తమ్ముడికి మోకాలి వాపు
చింతపండు ధర హెచ్చింది
చిన్నాన్నకు మతి భ్రమించింది
లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు
గోరుచుట్టలా సలిపే లక్షల సమస్యలు
గతమంతా తోలు బొమ్మలాడిన ఒక తెర
వర్తమానం నీ కన్నులగప్పిన ఒక పొర
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] వనరులు, మూలాలు
- శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - రేడియో ఉపన్యాసాల సంకలనం - ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం, విజయవాడ వారి ప్రచురణ - ఇందులో "అమృతం కురిసిన రాత్రి" పుస్తకంపై ఉపన్యాసం ఇచ్చినవారు జి. గిరిజా మనోహర్ బాబు, హన్మకొండ
- ↑ 1.0 1.1 "శత వసంత సాహితీ మంజీరాలు" లో జి. గిరిజా మనోహర్ బాబు
- ↑ కల్హార - స్వాతి బ్లాగు
- ↑ 3.0 3.1 ఈవాడులో చీకోలు సుందరయ్య వ్యాసం
